Nellore memories
______నాటి నెల్లూరు_____ ఒక సింహపురి ,SPSR NELLORE ఉద్యోగరీత్యా నెల్లూరు కొన్ని జ్ఞాపకాల పేటికలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు . ట్రంకురోడ్డు లోని చంద్ర భవన్ హోటల్ భోజనం దాంతో ఆనాటి నా జీవిత ఫ్లాష్ బాక్ మనోనేత్రం ముందు ప్రత్యక్షమైంది. అప్పటికే చదువు పూర్తి చేసుకున్న కుర్రవాణ్ణి. చదువు ఘనత వహించిన వీఆర్ కళాశాలలో. అది అన్నిటికీ ప్రసిద్ధి. అక్కడ చదివే వాడికి చదువుకున్నంత. లెక్చరర్లు చాలా బాగా చెప్పే వాళ్ళు. క్లాసులు ఎగ్గొట్టి తిరిగే వాళ్ళు తక్కువేం కాదు. కళాశాల ఎదురుగా ఒక పెద్ద చెట్టు. ‘గ్రీన్ వుడ్ ట్రీ’ అనేవాళ్ళు. అదే వాళ్లకు నీడ. తోడు ఎలాగూ స్నేహితులు ఉంటారు. పక్కనే సిమ్లా హోటల్. ఆ రోజుల్లో నెల్లూరులో ‘దం చాయ్’ ప్రవేశ పెట్టిన ఇరానీ హోటల్. అక్కడ స్నేహితులతో కలిసి టీ తాగి సిగరెట్ ఊదుతూ ప్రపంచ సమస్యలన్నీ చర్చించేసే వాళ్ళు. మధ్యాహ్నం వరకు అట్లా గడిపేసి ఇక చాలనుకుని వెళ్ళి పోయేవాళ్ళు కొందరు. ఇంకొందరు ఓపికగా మధ్యాహ్నం వచ్చి కళాశాలలో ఒక రౌండ్ తిరిగేసి ఎదురుగా ఉన్న లీలా మహాల్లో ఇంగ్లీషు సినిమాకో, కొంచెం పక్కగా ఉన్న వేంకటేశ్వర హాల్లో హిందీ కినిమాకో వెళ్ళి ఆనందించేవాళ్ళు. ఎంత తిరిగినా చద...