Old Generation

 .

ఒక తరం కనుమరుగౌతుంది,

ఒక్కొక్కరుగా, ఒకరి తర్వాత ఇంకొకరుగా..

స్వార్థం లేని తరం,

నిస్వార్థంగా అందరి అభివృద్ధిని ఆకాంక్షించిన తరం.

మమతను పంచిన తరం. 

మాధుర్యాన్ని అందించిన తరం.


అన్నం తినేముందు 

ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.

ఇరుకు ఇంట్లో కూడా

గొప్ప ప్రేమతో బ్రతికిన తరం.

కోరికలకంటే బాధ్యతల్ని ఎరిగిన తరం.

నా కోసం అనేకన్నా, మనకోసం అని బ్రతికిన తరం.


డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం.

గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం.

పుస్తకాలు చదువకున్నా, జ్ఞానాన్ని నింపుకున్న తరం.

కాలిక్యూలేటర్స్ లేకున్నా 

లెక్కలు చేయగలిగిన తరం.


మొబైల్ ఫోన్ లు లేకున్నా..

అందరికీ అందుబాటులో ఉన్న తరం.

TV లు లేకున్నా సంతోషంగా బ్రతికిన తరం.

GPS లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగిన తరం. 

సాంకేతికత లేకున్నా, 

సమర్థవంతంగా బ్రతికిన తరం.

AC లు, కూలర్లు లేకున్నా..

ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.


ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ లేకున్నా..

బావి నీరు, కుళాయి నీరు త్రాగిన తరం.

రెస్తారంట్లు, రకరకాల మెనూ ఐటమ్స్ లేకున్నా..

పచ్చడి మెతుకులు తిని కూడా ఆనందంగా బ్రతికిన తరం.


రాత్రిళ్ళు గుడి దగ్గర, ఇంటి అరుగులపై..

స్నేహితులతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ..

ఆనందంగా బ్రతికిన తరం.

పిల్లల్ని ఆరుబయట ఆటలు ఆడించిన తరం.

కిలోమీటర్ల దూరాన్ని సైతం.

అవలీలగా నడవగలిగిన తరం.


పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల్ని దండించినా..

ఉపాధ్యాయుల్ని సమర్దించిన తరం.


వీధి నాటకాలను వీక్షించిన తరం. 

తోలుబొమ్మలాటలను ప్రోత్సహించిన తరం. 

హారికధలకు ప్రాముఖ్యత నిచ్చిన తరం. 

హరిదాసులను గౌరవించిన తరం.

పండితుల్ని సత్కరించిన తరం.

సెన్సర్ అవసరం లేని సినిమాలు చూసిన తరం.


ఇంటిముంగిట ముగ్గిళ్లతో అలరించిన తరం. 

ఆచారాల్ని పాటించిన తరం. 

సాంప్రదాయాలకు విలువ నిచ్చిన తరం.

పండుగల్ని ఘనంగా జరుపుకున్న తరం. 

అన్ని ఋతువులకు ప్రేమతో ఆహ్వానం పలికిన తరం.

పనిమనుషులతో సంబంధం లేకుండా 

అన్నిపనులను తామే చేసుకోగలిగిన తరం.


బంధాలకు, బంధుత్వాలకు 

అత్యంత విలువ నిచ్చిన తరం. 

విలువలకు ప్రాధాన్యత నిచ్చిన తరం. 

ఆస్తులకన్నా, ఆప్యాయత లకు, అనుబంధాలకు విలువ నిచ్చిన తరం. 

ఉమ్మడికుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. 

బేదాభిప్రాయాలున్నా 

అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం.


తాము చేసే వ్యాపారం లో 

కల్తీకి చోటివ్వని తరం.

ఇతరుల మేలు కోరుకున్న తరం. 

నీతి నిజాయితీలకు అత్యంత విలువనిచ్చిన తరం.


అన్నీ తిన్నా అరిగించుకోగలిగిన తరం. 

కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా 

ఆరోగ్యంగా జీవించిన తరం.

హార్ట్ ఎటాక్ లు కాన్సర్ లాంటి జబ్బుల గురించి తెలియని తరం.

బీపీ లు, షుగర్ లను దరిచేరనీయని తరం.


చిన్న చమురు దీపాలతోనే 

జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. 

కష్టాల్ని సైతం ఇష్టంగా భావించి 

వాటిని సమర్థవంతంగా ఎదుర్కున్న తరం.

బాధలు ఉన్నా, భయాలు లేకుండా బ్రతికిన తరం. 

ఆస్తులు లేకున్నా 

ఆనందంగా జీవించిన తరం. 

అవసరాలను గుర్తించిన తరం. 

ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం.


పోస్ట్ కార్డు లపై సంభాషణలు జరిపిన తరం. 

వాటిని జ్ఞాపకాలుగా భద్రపరుచుకున్న తరం.

వారి త్యాగాలపై 

మన భవిష్యత్ కి పునాదులు వేసిన తరం.

అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు.

నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడచి వెళ్లిపోతున్నారు..

వారిని కోల్పోవడం..

మనం సర్వం కోల్పోతున్నామనే బాధ..

మన కాళ్ళక్రింద భూమి కదులుతున్న భావన..


నిన్ను నిన్నుగా అర్ధం చేసుకుని 

మనం చేసిన ప్రతి చర్యనూ అంగీకరించిన 

ఆ వాత్సల్యపు తరం. వెళ్ళిపోతున్న వేళ 

ఆ తరంలో మిగిలిన వారిని అపురూపంగా భావిస్తూ..

వారి జ్ఞాపకాలను మన హృదయంలో నిలుపుకుంటూ..

వారు నేర్పిన విలువలను మన జీవితంలో పాటిస్తూ..

వారి ఆశయాలను మన ఆశయాలుగా భావిస్తూ..

వారి ప్రేమను గుండెల్లో భద్రపరుచుకుంటూ.

వారిని మనజీవితంలో అత్యంత విలువైన వారిగా భావిస్తూ. 

వారికీ ప్రేమని పంచుదాం..

ఆప్యాయతని అందిద్దాం...

వారినుండి నేర్చుకున్న జీవిత పాఠాలను..

ముందు తరాలకు విలువలుగా అందిద్దాం..



Comments

Popular posts from this blog

Which AI tool is the most effective for academic research?

What is the best platform for affiliate marketing?

How do you grow your Facebook group organically?